ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు స్వయంగా మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యత, సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. భోజనం సరిగా లేకపోతే వెంటనే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.
పాఠశాల సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. భోజనం సిద్ధమైన తరువాత ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడు నాణ్యతను తప్పనిసరిగా పరిశీలించి, సరైనదని నిర్ధారించిన తర్వాతే విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు.
అదేవిధంగా, తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా లీప్ యాప్ వినియోగాన్ని తప్పనిసరి చేయాలని పల్లా సూచించారు. విద్యార్థుల భోజనం నాణ్యతపై తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు, ఫిర్యాదులు లీప్ యాప్ ద్వారా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, ఐవీఆర్‌ఎస్ ద్వారా కూడా తరచూ తల్లిదండ్రుల ఫీడ్‌బ్యాక్ సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని, నిర్లక్ష్యం లేదా ఎటువంటి తప్పిదం జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పాఠశాలలో విద్యాబోధన తీరు, హాజరు వివరాలు, మౌలిక వసతులు, పరిశుభ్రతపై కూడా పల్లా సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి మెరుగైన విద్యను అందుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే నాణ్యతతో కూడిన విద్య, సదుపాయాలు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

Comments
Post a Comment